చికిత్స పేరుతో కాలయాపన.. ‘ఆపరేషన్ సక్సెస్’ అని చెప్పి ప్రాణం తీసిన వైద్యులు..

Spread the love

జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి పరాకాష్టకు చేరింది. అపెండిక్స్ ఆపరేషన్ కోసం వచ్చిన ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఉప్పరి ఇందు (17) అనే బాలిక, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందు కొంతకాలంగా అపెండిక్స్ నొప్పితో బాధపడుతుండగా, మెరుగైన వైద్యం కోసం శుక్రవారం రాత్రి 10:00 గంటలకు కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి బాలికకు సరైన చికిత్స అందించకుండా, రాత్రంతా నామమాత్రపు పరీక్షలతోనే సిబ్బంది కాలయాపన చేశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి.. మరణవార్తను దాచిపెట్టి!

శనివారం మధ్యాహ్నం 2:00 గంటలకు బాలికను ఆపరేషన్ కోసం తీసుకెళ్లిన వైద్యులు, గంట తర్వాత ఆపరేషన్ విజయవంతమైందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కానీ, ఆ తర్వాత బాలికను చూపించకుండా, బీపీ పెరుగుతోందని, ఇతర కారణాలు ఉన్నాయని సాకులు చెబుతూ గంటల తరబడి కాలయాపన చేశారు. వైద్యుల మాటలను నమ్మి ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, సాయంత్రం 6:00 గంటలకు బాలిక మరణించిందనే చేదు వార్త తెలిసింది. ఈ విషయంలో సిబ్బంది అప్రమత్తమై విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కుటుంబ సభ్యులను నమ్మబలికి, రాత్రి 8:00 గంటల తర్వాత హుటాహుటిన మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి పంపించివేశారు.

అంబులెన్స్‌ను తిరిగి ఆసుపత్రికి తరలించిన స్థానికులు:

ఆసుపత్రి సిబ్బంది వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రవల్లి గ్రామస్తులు, సిబ్బంది తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బాలిక మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అంబులెన్స్‌ను తిరిగి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ తిరిగి రావడంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద మృతదేహంతో రోడ్డుకు అడ్డంగా పడుకొని, కుటుంబ సభ్యులు, స్థానికులు న్యాయం కోసం నిరసన తెలుపుతున్నారు.

భారీగా మోహరించిన పోలీస్ బలగాలు:

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రూరల్ ఎస్సై శ్రీకాంత్ తన బృందంతో అక్కడికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రిపోర్టింగ్: రాఘవ బంగారు | 9849171290

ఇలాంటి మరిన్ని వార్తలు కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మీ మిత్రులకు ఈ వార్తను షేర్ చేయండి.


Spread the love