బాధితులకు ఆశ్రయం, భద్రత కల్పించాల్సిన సఖి కేంద్రం గద్వాలలో ఇప్పుడు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. రక్షణ కల్పించాల్సిన కేంద్రం నుండే బాధితురాలు గోడ దూకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అక్కడ భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గట్టు మండలానికి చెందిన ఓ మహిళ గతంలో అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని గుర్తించి, రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెను గత నెల చివరలో సఖి కేంద్రానికి అప్పగించారు. కానీ, సఖి కేంద్రం సిబ్బంది భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా సదరు మహిళ ఈ నెల 1న కేంద్రం గోడ దూకి అదృశ్యం కావడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర సంచలనం రేపుతోంది.
పాత రోతలే.. మళ్ళీ మొదలయ్యాయా?
గతంలో ఇదే సఖి కేంద్రంలో సిబ్బంది పార్టీలు నిర్వహించారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం వల్లే ఇలాంటి అరాచకాలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రయం కోసం వస్తే, నిర్బంధం, భద్రతా లోపాలతో బాధితులు గోడలు దూకే పరిస్థితి రావడం వ్యవస్థ వైఫల్యమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ లభిస్తుందని నమ్మి వచ్చిన మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం పట్ల సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వివరణ, పోలీసుల గాలింపు ముమ్మరం
ఈ ఘటనపై జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సునందను వివరణ కోరగా.. ఘటనకు బాధ్యులైన సిబ్బందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళ అదృశ్యంపై గద్వాల పట్టణ ఎస్సై కల్యాణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశామని, మరో రెండు రోజుల్లో ఆమెను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేంద్రం నిర్వహణను ప్రక్షాళన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టింగ్: రాఘవ బంగారు | 9849171290
ఇలాంటి మరిన్ని వార్తలు కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మీ మిత్రులకు ఈ వార్తను షేర్ చేయండి.











