మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. శామీర్‌పేట తహశీల్దార్ కార్యాలయం. రోజువారీ పనులతో రద్దీగా ఉండాల్సిన ఆ ఆఫీసులో, ఈరోజు సీన్ మొత్తం మారిపోయింది. ఎక్కడికక్కడ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ చూస్తుండగా.. అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. అందరూ ఊహించినట్లుగానే, తహశీల్దార్ సుచరిత అవినీతి బాగోతం బయటపడింది. ఏకంగా రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ఆమె అడ్డంగా ఏసీబీకి చిక్కడం ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది.
బొమ్మరాసిపేటలో కొన్ని భూములను క్రమబద్ధీకరించే పనిలో సుచరిత కీలకంగా వ్యవహరించారు. భూముల క్రమబద్ధీకరణ అంటే సామాన్య రైతులకు అది ఒక పెద్ద ప్రహసనం. కానీ, సుచరిత మాత్రం ఆ భూములను ‘క్లియర్’ చేసేందుకు భారీగా డిమాండ్ చేశారు. రూ. 20 లక్షలు.. ఇది చిన్న మొత్తం కాదు. ఇంత భారీ మొత్తానికి ఆ భూముల్లో ఏముంది? ఆమె ఒక్కరే ఈ అవినీతికి పాల్పడ్డారా? లేక ఆమె వెనుక ఇంకెవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా?
కేవలం ఆమె మాత్రమే కాదు, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ భూదందా సాగుతోందనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సాక్ష్యాలను, కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు బయటపడిన ఆ విషయాలు చూసి అధికారులే షాక్ అయ్యారు. కార్యాలయంలోని ఫైల్స్, లంచం సొమ్ము, ఆమె డైరీల్లో ఉన్న పేర్లు చూస్తుంటే.. ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
అవినీతికి పాల్పడితే ఇలాగే ఉంటుందని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నా.. లంచావతారాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు తహశీల్దార్ సుచరిత అరెస్ట్ కేవలం ఆరంభం మాత్రమేనా? ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? ఉన్నతాధికారుల పాత్ర ఉందా లేదా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. సుచరిత దొరికిన తీరు, ఆ 20 లక్షల వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటి? త్వరలోనే బయటపడనుంది.
రిపోర్టింగ్: జర్నలిస్ట్ రాఘవ బంగారు | 9849171290











