రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి, తెలంగాణ వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పకు కోటి రూపాయల మేర టోకరా వేసిన నిందితుడిని గద్వాల పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మోసారా ఇన్ఫ్రా డెవలపర్స్‌కు చెందిన మారెళ్ల పెంచల సుబ్బారెడ్డి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడుల పేరుతో గట్టు తిమ్మప్ప నుంచి భారీగా నిధులు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో గానీ, ఒప్పందాల ప్రకారం గానీ ఎటువంటి పురోగతి చూపకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన తిమ్మప్ప, రెండు నెలల క్రితం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దమ్కీ ఇచ్చి దండుకున్న వైనం:
కోటి రూపాయల పెట్టుబడి పేరుతో తిమ్మప్పను నమ్మించి, అనంతరం ఆయనకు గట్టిగా దమ్కీ ఇచ్చి మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, నిందితుడి కదలికలపై నిఘా ఉంచి గాలింపు చేపట్టారు. నిందితుడు మారెళ్ల పెంచల సుబ్బారెడ్డి హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో, రంగంలోకి దిగిన పోలీసులు శనివారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గద్వాలకు తరలింపు, విచారణ ముమ్మరం:
అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారణ నిమిత్తం గద్వాలకు తరలించారు. ఈ కీలక అరెస్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను, కేసులోని లోతైన అంశాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ మొగులయ్య మీడియాకు తెలిపారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో నిందితుడు మరికొంతమందిని కూడా మోసం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
రిపోర్టింగ్: రాఘవ బంగారు | 9849171290
ఇలాంటి మరిన్ని వార్తలు కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మీ మిత్రులకు ఈ వార్తను షేర్ చేయండి.











