రాజకీయాల్లో సహనంపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Spread the love

రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీని నడపడం ఏమాత్రం సులభం కాదని, తాను కులం గురించి మాట్లాడుతున్నానని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయినా కుల ప్రాతిపదికన సమీకరణలు చేయడం సహజమని, తనను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని నిలదీశారు. తనకు ఉన్న ఓపిక మరే నాయకుడికి ఉండదని, తమిళనాడు రాజకీయాలు ఎంతో ప్రశాంతంగా, సాఫీగా సాగుతున్నాయని, ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం చూస్తే తనకు ఎంతో అసూయ కలుగుతుందని పవన్ వ్యాఖ్యానించారు.

ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన చర్చల అంశంపై వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. అమిత్ షాతో తాను ఏమి మాట్లాడతానో బయట వ్యక్తులకు ఎలా తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు జైలుకు వెళ్లాలని తాను కోరుతున్నానని, అందుకే తనకు క్లాస్ తీసుకున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రత్యర్థులు జైలుకు వెళ్లడం వల్ల తనకో, జనసేన పార్టీకో ఎలాంటి ఎదుగుదల ఉండదని, రాజకీయాల్లో ఇలాంటి కక్షసాధింపు ధోరణులు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాలు లేని రాజకీయాలు చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.

జనసేనపై రాళ్లు వేసే ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రత్యర్థులను ఆయన హెచ్చరించారు. “నేను కూడా మనిషినే, నాకు కూడా కోపాలు ఉంటాయి, మీరు కొడుతుంటే మేం భరిస్తూనే ఉండాలా?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు, కన్నీళ్లు కేవలం ప్రత్యర్థులకే ఉంటాయని అనుకోవద్దని, సహనానికి కూడా హద్దులు ఉంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే తాట తీస్తానని తాను చాలారోజుల క్రితమే చెప్పానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, లేనిపక్షంలో ఎదురుదాడి తప్పదని ఆయన స్పష్టం చేశారు.

రిపోర్టింగ్: జర్నలిస్ట్ రాఘవ బంగారు | 9849171290


Spread the love