తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ సేవలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనివల్ల స్థానిక యువతకు వారి సొంత జిల్లాల్లోనే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ విస్తరణలో భాగంగా, పరిశ్రమలకు ఒకే వేదికపై అన్ని అనుమతులు అందించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రపంచస్థాయి ఏఐ (Artificial Intelligence) సదుపాయాలతో ‘ఏఐ సిటీ’ని, ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెట్-జీరో విధానాలతో కూడిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రపంచస్థాయి పెట్టుబడిదారులతో చర్చిస్తున్నారు. అలాగే, యువత నైపుణ్యాభివృద్ధికి ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’తో ఐటీ కంపెనీలు ఎంఓయూలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు కూడా ప్రత్యేక రాయితీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ కనెక్టివిటీని రాబోయే మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఇప్పటికే రూ. 54 కోట్లను విడుదల చేశారు. ఐటీ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేస్తున్నామని అధికారులు తెలిపారు. తెలంగాణను నాలెడ్జ్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రిపోర్టింగ్: జర్నలిస్ట్ రాఘవ బంగారు | 9849171290











